హిల్లరీ వెంట కూడా ట్రంప్ పడ్డారా..?

అదిగో తోక అంటే ఇదిగో పులి అనే బ్యాచ్ కనిపిస్తూనే ఉంటుంది. కంపు మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మాటలే కాదు.. చేతలు కూడా కంపేనన్న విషయం తాజాగా స్పష్టమైన సంగతి తెలిసిందే. తరచూ మహిళల్ని కించపరిచేలా మాట్లాడే ట్రంప్.. చేతల్లోనూ గలీజు వ్యక్తేనన్న విషయం తాజాగా స్పష్టమైంది. అయ్యగారి భాగోతాలకు సంబంధించిన వీడియో.. ఆడియో క్లిప్పింగులు ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కీలకమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. ట్రంప్ మీద కొత్త కొత్త ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. గడిచిన వారం వ్యవధిలో ట్రంప్ కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చేయటంలో ఆయన వైరి వర్గం కానీ.. మీడియా కానీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ట్రంప్ మా గొప్ప ఉమనైజర్ అని.. కనిపించిన అమ్మాయినల్లా కెలికేసే దరిద్రపు బుద్ధి అతడికి ఉందన్న విషయం ఆధారాలతో సహా నిరూపించేసిన పరిస్థితి.

ఊహించని రీతిలో తన క్యారెక్టర్ మీద వచ్చిన సరికొత్త ఇమేజ్ తో షాక్ తిన్న ట్రంప్ వర్గం.. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఇంకా సిద్ధమైనట్లుగా కనిపించటం లేదు. ఇదిలా ఉంటే.. ట్రంప్ ను తీవ్రంగా దెబ్బ తీసేందుకు దొరికిన సరికొత్త ఆయుధాన్ని డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సైతం వాడేసుకునేలా కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుంది.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే గుణం ఉందన్న ట్రంప్ పై ఆమె సరికొత్త ఆరోపణలు చేశారు. పలువురు మహిళల పట్ల ట్రంప్ అసభ్యంగా వ్యవహరించినట్లుగా వస్తున్న ఆరోపణల మాదిరే తన పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించినట్లుగా హిల్లరీ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన డిబేట్ 2 సమయంలో ట్రంప్ ప్రేమోన్మాదిగా తన వెంట పడ్డారని.. తన మీదకు వచ్చారంటూ తాజాగా ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో హిల్లరీ వ్యాఖ్యానించటం గమనార్హం. కోట్లాది మంది చూసిన బిగ్ డిబేట్ లో ట్రంప్ తీరును సరికొత్తగా చెబుతున్న హిల్లరీ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తున్నాయి.

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.