స్టార్ హీరో ఇల్లు కూల్చివేతకు టైం ఇచ్చారు!

కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప నివాసంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని స్వచ్ఛందంగా తొలగించడానికి బెంగళూరు జిల్లా అధికార యంత్రాంగం ఒక్క వారం గడువు ఇచ్చింది. ఈ విషయంలో సదరు హీరో ఆ కట్టడాన్ని స్వచ్ఛందంగా తొలగించకుంటే తామే కూల్చేస్తామని ఈ మేరకు బీబీఎంపీ అధికారులు చెప్పారు. కాగా బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ రాజకాలువ (డ్రైనేజ్) మీద ఇంటిని నిర్మించారని దర్శన్ పై ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో బీబీఎంపీ మేయర్ మంజునాథ రెడ్డి అధికారులతో కలిసి దర్శన్ ఇంటిని పరిశీలించి ఈ ఇంటిని అక్రమంగా నిర్మించారని గుర్తించారు. ఇదే క్రమంలో కర్ణాటక మాజీ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు చెందిన ఎస్ ఎస్ ఆసుపత్రి కూడా అదే లైన్ లో అక్రమంగా నిర్మించారని గుర్తించారు. కాగా బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) గత రెండు నెలల నుంచి ఆపరేషన్ రాజకాలువ కొనసాగిస్తోంది.

దీంతో హీరో దర్శన్ – మాజీ మంత్రి శివశంకరప్పకు చెందిన కట్టడాలను వారం రోజుల్లోగా స్వచ్ఛందంగా తొలగించడానికి అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో వీరిద్దరితో పాటు మొత్తం 69 మందికి ఈ మేరకు నోటీసులు అందజేశారు. హలగేవడరహళ్లి గ్రామ పరిధిలో ఉన్న సుమారు 7 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమిలో ఐడియల్ హోమ్స్ సహకార సంఘం పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా లేఔట్ వేశారు. అందులో 3 ఎకరాల 20 గుంటల స్ధలంలో మొత్తం 32 ఖాళీ స్థలాలు ఉండగా ఎకరా 38 గుంటల స్థలంలో ఇళ్లు భవనాలు నిర్మించారు. ఇప్పుడు వారందరికీ బీబీఎంపీ నోటీసులు జారీచేసింది.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.