సంపూ సినిమా తమిళంలోకి.. నిజమేనా?

బర్నింగ్ స్టార్ అని తనకు తాను ఒక బిరుదు ఇచ్చుకుని.. కొన్నేళ్ల కిందట ఫేస్ బుక్ లోకి దూకాడు సంపూర్ణేష్ బాబు. అతడి విచిత్ర విన్యాసాల్ని నెటిజన్లు బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అనుకోకుండా రాజమౌళి కళ్లల్లో పడటం.. సంపూను పొగిడేస్తూ ఆయన మెసేజ్ పెట్టడం.. అలా అలా సంపూ పాపులారిటీ పెరిగిపోవడం.. ‘హృదయ కాలేయం’ అనూహ్యంగా హిట్టవడం.. సంపూ తనకంటూ టాలీవుడ్లో ఒక గుర్తింపు తెచ్చుకోవడం.. చకచకా జరిగిపోయాయి. ‘హృదయ కాలేయం’ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సంపూ.. హీరోగా చేసిన రెండో సినిమా ‘సింగం 123’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా.. ‘కొబ్బరి మట్ట’ విషయంలో మాత్రం మళ్లీ మంచి క్రేజే సంపాదించుకున్నాడు.

ఆ మధ్య విడుదలైన ‘కొబ్బరి మట్ట’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. టీజర్ వచ్చిన కొన్ని రోజుల వరకు సందడి చేసిన ‘కొబ్బరి మట్ట’ ఆ తర్వాత వార్తల్లో లేకుండాపోయింది. ఇప్పుడు మళ్లీ ఆసక్తికర కబురుతో వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ తమిళ కమెడియన్ ఈ చిత్ర రీమేక్ మీద ఆసక్తి చూపిస్తున్నాడట. రీమేక్ రైట్స్ కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు ‘కొబ్బరిమట్ట’ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఐతే ఇంకా సినిమా విడుదల కూడా కాకుండానే రీమేక్ రైట్స్ కోసం పోటీపడటం.. అది కూడా సంపూ సినిమా కోసం కావడమే నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఇది పబ్లిసిటీ కోసం ‘కొబ్బరి మట్ట’ టీమే చేస్తున్న ప్రచారమా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. వాస్తవమేంటో ఇంకొన్ని రోజుల్లో తేలకపోదుగా!

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.