విజయవాడకు హైస్పీడ్ ట్రైన్ వస్తోందట!

అన్నీ అనుకూలంగా జరిగిగే త్వరలో ఏపీలో హైస్పీడ్ రైలు సంచరించనుంది. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తాజాగా జర్మనీ ప్రభుత్వానికి సూచించడం ప్రభుత్వం అంగీకరించడం జరిగిందట. ఇండియాలో హైస్పీడ్ రైలు… ఈ విషయం గత కొంత కాలంగా హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఊహించనంత తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరవేయడంలో ఈ హైస్పీడ్ రైల్ ప్రతిభ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో విజయవాడ మీదుగా హైస్పీడ్ ట్రైన్ రానుందని తెలుస్తోంది. గంటకు సుమారు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ప్రాజెక్ట్ ని జర్మనీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించనుంది. అయితే ఈ హైస్పీడ్ రైలు ఏర్పాటుపై వచ్చే ఏడాది అధ్యయనం మొదలుపెట్టనుంది జర్మనీ ప్రభుత్వం. ప్రత్యేక కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏడాదిలోగా అధ్యయనం పూర్తి చేయనుంది. ఈ క్రమంలో ఈ రైలు మైసూర్ – బెంగళూరు – చెన్నై (వయా విజయవాడ) రానుందని తెలుస్తోంది.

రాబోయే రెండేళ్లలో హైస్పీడ్ రైలును నడిపేలా ప్లాన్ చేస్తామంటున్నారు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు. వాస్తవానికి ఈ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదన మొదట మైసూరు నుంచి చెన్నై వరకే ఉంది. అయితే ఈ లైన్ ను విజయవాడ వరకూ పెంచాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు – జర్మనీ ప్రభుత్వానికి సూచించడం వెంటనే ఓకే చేయడం జరిగిపోయిందట. ఈ విషయమై ఢిల్లీలో జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరిపింది. హైస్పీడ్ రైల్వే కారిడార్ తో దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలన్నీ అనుసంధానం కావడం ఇది ప్రాంతీయాభివృద్ధికి మరింత దోహద పడుతుందని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ఇదే సమయంలో హైస్పీడ్ కారిడార్ ను విజయవాడ వరకే కాకుండా విశాఖపట్నం వరకూ పొడిగించాలని సురేష్ ప్రభుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నారని దీంతో మొదట విజయవాడ వరకూ హైస్పీడ్ కారిడార్ పనులు పూర్తి చేసి రెండో దశలో విశాఖపట్నం వరకూ పొడిగించే అంశంపై దృష్టి సారించాలని సురేశ్ ప్రభు జర్మనీ ప్రభుత్వాన్ని కోరారని తెలుస్తోంది. కాగా ఇటీవల ఢిల్లీ నుంచి ఆగ్రా వరకూ ప్రవేశపెట్టిన గతిమాన్ ఎక్స్ ప్రెస్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. అంటే… గతిమాన్ ఎక్స్ ప్రెస్ కు రెట్టింపు వేగంతో మైసూరు – విజయవాడ హైస్పీడ్ రైలు నడవనుందన్న మాట.

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.