రాజ్ నాథ్ సింగ్ ది ఎంత పెద్దమనసు!

ఇంతకాలం భారతదేశం అన్ని విదాలా పాకిస్థాన్ కంటే బలమైంది అయినా కూడా పాక్ ఎందుకు అలా చెలరేగిపోతుంది.. భారత్ కంటే ఏ విషయంలో తాను బలంగా ఉన్నానని భావించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.. దానికి భారతదేశం ఎంచుకున్న శాంతి మార్గమే సమాధానం అని కొందరంటుంటే – ఉగ్రవాదుల బలం భారత్ కు లేదు కాబట్టి అని మరికొందరంటుంటారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే తాజగా భారతదేశ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం శాంతి కాముకమైన మాటలే మాట్లాడారు.. అక్కడితో ఆగకుండా పాక్ కోరితే ఉగ్రవాదులను అణిచివేసే విషయంలో సహాయం కూడా చేస్తామని ఆఫర్ ఇచ్చారు.

“పాకిస్థాన్ ప్రభుత్వం కోరితే ఆ దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్దంగా ఉన్నాం” ఈ మాట అన్నది అగ్రరాజ్యం అమెరికానో – పాక్ తో సైనిక సహకార ఒప్పందం చేసుకుంటున్న రష్యానో – పాక్ ప్రాణమిత్రుడు చైనానో అన్నది కాదు. పాక్ వల్ల – వారి అప్రకటిత సైన్యం అయిన ఉగ్రవాదుల వల్ల తీవ్రంగా నష్టపోతున్న – కంటిపై కునుకులేకుండా జీవిస్తున్న భారత్! అవును స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రకటన చేశారు! బెంగళూరులోని నేషనల్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సందర్భంగా హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వ్యూహంలో భాగంగా చేశారా? లేక శాంతి కాముక దేశం కాబట్టి ఉరీ ఉగ్రదాడి అనంతరం కూడా పాక్ కు ఒక ఆఫర్ ఇస్తున్నారా!… అనేది ఎవరి ఆలోచనల మేరకు ఎవరి నమ్మకాల మేరకు వారు ఊహించుకుంటున్నారు.

కాగా మరోపక్క పాకిస్థాన్ విషయంలో భారత్ దుస్సాహసాలకు పాల్పడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ హెచ్చరిస్తున్నారు. భారత్ చేసిన సర్జికల్ దాడులు బూటకమని పాతపాటేపాడుతున్న రహీల్… అమాయకులైన కశ్మీరీలపై భారత సైన్యం అరాచకాలకు పాల్పడుతోందని వాటి నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకే సర్జికల్ దాడుల డ్రామా అడుతోందని విమర్శించారు.

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.