మరీ.. అంత ఖరీదైన కలలేంటి చంద్రబాబు?

కలల కనటం తప్పు కాదు. కనే కలల.. పెద్ద కలలు కనమని చెబుతుంటారు. ఇలాంటి మాటలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా గుర్తుంటాయేమో. ఆయన వ్యక్తిగతమైనఅంశాల వరకూ ఇలాంటివి ఓకే. కానీ.. ఆయన కనే కలలన్ని తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ ప్రజల గురించి కావటమే అసలు సమస్య. ఎందుకంటే.. కలల్ని కనే విషయంలో ఎంత వేగంగా ఉంటారో.. వాటిని సాకారం చేసే అంశంలో అంతే స్లోగా ఉంటారు. అదే ఆయనతో ఇబ్బంది. ఒకటి తర్వాత ఒకటిగా తన కలల్ని వరాలుగా చెప్పే ఆయన.. లేనిపోని ఆశల్ని ప్రజల మనసుల్లోకి వచ్చేలా చేస్తుంటారు.

సార్వత్రిక ఎన్నికల వేళ.. బాబు వస్తే జాబు పక్కా అని ఉదరగొట్టేశారు. ఎవరూ.. ఎలా అని అడిగింది లేదు. ఎందుకంటే.. సైబరాబాద్ ను సృష్టించిన చంద్రబాబు.. విభజనతో చితికిపోయిన ఏపీకి ఏదో చేసేస్తారన్న నమ్మకమే. జాబు విషయంలో ఎంత బలంగా చెప్పారో.. ఉద్యోగం లేని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని కొత్త ఆశలు రేపారు. అంతదాకా ఎందుకు అస్సలు అడగనే అడగని కాపుల్ని తట్టి మరీ.. తాను పవర్ లోకి వచ్చిందే తడువు వారిని బీసీల్లోకి చేర్చేస్తానని వరాన్ని ఇచ్చేశారు. బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న వరాన్ని తీర్చనందుకు ఆయా వర్గాలు ఎంత కోపంగా ఉండాలో అంత కోపంగా ఉన్నాయి.

ఇప్పటికే ఇచ్చిన వరాల్ని సాకారం చేసే విషయంలో కిందా మీద పడుతున్న చంద్రబాబు.. ఉన్న తలనొప్పులు సరిపోవన్నట్లుగా సరికొత్తగా మరిన్ని నెత్తి మీదకు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. పేదవాడికి ఆర్థిక భద్రత పేరుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు ఆదాయం అందించే ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇవాల్టి రోజున రూ.10వేలు అంటే మాటలు కాదు. ఒక చిన్నస్థాయి ఉద్యోగి గానుగెద్దు మాదిరి పని చేస్తే కానీ ఆ మొత్తం చేతికి రాదు. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. సంక్షేమ పథకాలన్నింటిని కలిపి ఒక్కో కుటుంబానికి నెలకు రూ.10వేల చొప్పున సంపాదించుకునేలా ఏర్పాటు చేస్తామని చెప్పే వైనం చూస్తే షాకింగ్ గా అనిపించక మానదు. రాష్ట్రప్రభుత్వం అమలు చేసే పథకాలతో పాటు.. కేంద్ర పథకాలైన ముద్ర.. స్టార్టప్స్.. స్టాండప్స్ లాంటి కార్యక్రమాల్నికలుపుకొని పేదవారిని ఆర్థికంగా శక్తివంతం చేయాలని తాను భావిస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒక్కో పేద కుటుంబానికి రూ.10వేల చొప్పున.. ఏపీలో ఉన్న పేద వారి మొత్తానికి ఇచ్చేందుకు ఎన్ని వేల కోట్లు కావాలి? ఆ లెక్క వేసుకొనే చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి ప్రకటన వచ్చిందా? అన్నదే ప్రశ్న. ఇలాంటి కొత్తకొత్త ఆశల్ని కల్పించి లేనిపోని సమస్యలు మీదేసుకోవటం బాబుకు మాత్రమే సాధ్యమేమో..?

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.