బన్నీ విలన్.. సాయిధరమ్ కూ విలనే

పవన్ కళ్యాణ్ అభిమానులతో డీలింగ్ విషయంలో అల్లు అర్జున్.. సాయిధరమ్ తేజ్ మధ్య అనుకోని అంతరం ఏర్పడిపోయింది. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మద్దతుదారుల మధ్య పెద్ద వారే నడిచింది అప్పట్లో. ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఇప్పుడు అనుకోకుండా అల్లు అర్జున్ చివరి సినిమా ‘సరైనోడు’లో విలన్ పాత్ర పోషించిన ఆది పినిశెట్టిని తన సినిమా కోసం ఎంచుకున్నాడు సాయిధరమ్ తేజ్.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ ‘విన్నర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ రోజు తేజు పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విలన్ పాత్రకు అనేక మందిని పరిశీలించి ఆది పినిశెట్టినే ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ‘సరైనోడు’లో బన్నీ-ఆది కెమిస్ట్రీ భలేగా వర్కవుటైంది. మరి తేజు-ఆది జోడీ కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

మరోవైపు ఆదికి మరిన్ని తెలుగు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు లభిస్తున్నట్లు సమాచారం. ‘నేను లోకల్’ తర్వాత కొత్త దర్శకుడు శివ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమాలోనూ ఆది కీలక పాత్ర పోషిస్తాడట. దశాబ్దం కిందట తెలుగులో ‘ఒకవిచిత్రం’ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు ఆది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’తో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ రెండు సినిమాలూ నిరాశ పరిచినా ‘సరైనోడు’ అతడి రాతను మార్చేసింది.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.