నారా రోహిత్ దర్శకులతో త్రివిక్రమ్?

హారిక హాసిని క్రియేషన్స్ బేనర్ లో త్రివిక్రమ్ చేసే సినిమాలన్నింట్లో అతను నిర్మాణ భాగస్వామి కూడా అన్న ప్రచారం ఉంది టాలీవుడ్లో. ఈ ప్రచారాన్ని ఒక ప్రెస్ మీట్లో కొట్టిపారేశాడు త్రివిక్రమ్. అవసరమనుకుంటే నేనే నిర్మాతగా మారతాను కదా అని కూడా అన్నాడు అప్పట్లో త్రివిక్రమ్. ఇప్పుడు ఆ అవసరం వచ్చేసింది. నిర్మాతగా మారిపోయాడు. ఈ మధ్యే విజయ్ దేవరకొండ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే మాటల మాంత్రికుడు అంతటితో ఆగట్లేదు. నిర్మాతగా మరో రెండు ఆసక్తికర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

నారా రోహిత్ తో పని చేసిన ఇద్దరు దర్శకులతో త్రివిక్రమ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతుండటం విశేషం. ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య చెప్పిన ఓ కథకు త్రివిక్రమ్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. రౌడీ ఫెలో సినిమా అంటే తనకెంతో ఇష్టమంటూ ‘అఆ’కు సంబంధించిన ఓ కార్యక్రమంలో త్రివిక్రమ్ చెప్పిన సంగతి తెలిసిందే. ‘అఆ’ టైంలో కృష్ణచైతన్యతో చాలా రోజులు ట్రావెల్ అయ్యాడు త్రివిక్రమ్. ఆ సినిమాకు అతడితో ఒక పాట కూడా రాయించుకున్నాడు.

మరోవైపు ఇటీవలే ‘జ్యో అచ్యుతానంద’తో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ కూడా సంపాదించిన అవసరాల శ్రీనివాస్ తోనూ త్రివిక్రమ్ ఓ సినిమాను నిర్మిస్తాడట. అవసరాల లాంటి మంచి టేస్టున్న దర్శకుడితో పని చేయడానికి త్రివిక్రమ్ చాలా ఆసక్తితో ఉన్నాడట. తెలుగు సినిమాల్లో రచయితగా తనదైన ప్రస్థానం సాగించిన త్రివిక్రమ్ ను.. అవసరాల తన రైటింగ్ స్టయిల్ తో పడేశాడు. దీంతో తన ప్రొడక్షన్లో అవసరాలతో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ఇలా ఓ అగ్ర దర్శకుడు.. ఇద్దరు యువ ప్రతిభావంతులతో సినిమాలు ప్రొడ్యూస్ చేయబోతుంటం మంచి పరిణామం.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.