కేసీఆర్ ‘దీపావళి’ థమాకా అదిరిపోతుందట

తెలంగాణలో అతి పెద్ద పండగైన దసరా పండగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘కొత్త జిల్లాల’ కానుక తెలంగాణ ప్రజలు అస్సలు మర్చిపోలేరు. ఒకట్రెండు జిల్లాల ఏర్పాటుకే కిందా మీదా పడే రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు భిన్నంగా..ఒకేసారి 21 జిల్లాల్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ తాను తలుచుకుంటే ఏదైనా చేస్తానని మరోసారి నిరూపించారు. పది జిల్లాలతో ఉన్న రాష్ట్రాన్ని31 జిల్లాలుగా మార్చటం.. అది కూడా స్వల్ప వ్యవధిలో అన్నది సామాన్యమైన విషయం కాదు. కొత్త జిల్లాల కసరత్తు ఏడాదికి ముందే షురూ అయినప్పటికి.. చివరి నెల రోజుల్లో జరిగిన మార్పులు.. చేర్పులే ఎక్కువని చెప్పక తప్పదు.

అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జిల్లాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయటంలో తెలంగాణ సర్కారు సక్సెస్ అయ్యింది. తెలంగాణ ప్రజల్నిఖుషీగా మార్చిన కొత్త జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ భారీ రాజకీయ వ్యూహాన్ని అనుసరించినట్లుగా వాదనలు వినిపిస్తున్నా.. అందులో నిజం ఎంతన్నది శాస్త్రీయంగా ఎవరూ నిరూపించలేకపోయారని చెప్పక తప్పదు. దసరాకు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తామన్న మాటకు తగ్గట్లే పూర్తి చేసిన కేసీఆర్.. తాజాగా దీపావళి పండగ కానుకను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో స్పష్టత రావటంతో పాటు.. ఇంతకాలం నామినేటెడ్ పోస్టుల భర్తీ.. పార్టీని మరింత బలంగా చేసేందుకు అవసరమైన వ్యవస్థాగత మార్పులు.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ లాంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పుడు పనులు పూర్తి చేయటానికి వీలు ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందా? అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా.. ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారిలో నలుగురైదుగురిని పార్టీ కోసం పక్కకు పెట్టి.. కొత్త వారికి అవకాశం ఇవ్వటం.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయటంలాంటివి దీపావళికి ఉండొచ్చన్న చర్చ అధికార పార్టీలోనే కాకుండా.. రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా తొమ్మిది కార్పొరేషన్ల ఛైర్మన్ పదవుల్ని సీనియర్లతో భర్తీ చేయటంతో మిగిలిన వాటిని సైతం భర్తీ చేసే దిశగా కేసీఆర్ అడుగు వేస్తారన్న అంచనాలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం పరిస్థితులన్ని సానుకూలంగా ఉండటం.. పార్టీపైనా.. ప్రభుత్వంలోనా తిరుగులేని అధిపత్యం.. కేసీఆర్ మాటకు మరో మాట చెప్పే వారెవరూ లేని వేళ.. పదవులన్ని భర్తీ చేయటం ద్వారా వచ్చే కొద్దిపాటి అసంతృప్తి లాంటివేమీ ఉండవన్న మాట వినిపిస్తోంది. అయితే.. బయట జరుగుతున్న చర్చకు తగ్గట్లే కేసీఆర్ మైండ్ సెట్ ఉందా?… లేదంటే భిన్నంగా ఆలోచిస్తున్నారా? అన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దసరా హడావుడి ఇంకా ఒక కొలిక్కి రాని వేళ.. దీపావళికి మరో థమాకాకు కేసీఆర్ సిద్ధంగా లేరన్న మాట కాస్తంత బలంగా వినిపిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు సంబంధించిన పాలనా పరమైన మార్పులు.. చేర్పులు.. నేతల్లోని సరిహద్దు వివాదాల్ని ఒక కొలిక్కి తెచ్చిన తర్వాతే పదవుల అంశంపై దృష్టి సారిస్తారని చెబుతున్నారు.

ఈ వాదనకు భిన్నమైన వాదన మరికొందరు వినిపిస్తున్నారు. పనిలో పనిగా పదవుల పంపకాల ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా.. పాలన మీద మరింత పట్టు పెంచుకోవచ్చన్నది మరో వాదన. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి అయిన వేళ.. మార్పులకు ఇదే సరైన సమయంగా అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు పదవులు ఇచ్చినా ప్రయోజనం ఉండదని.. అదే సమయంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయటం ద్వారా.. దాని ఫలితాలు అందటానికి కనీసం ఏడాది.. ఏడాదిన్నర సమయం పట్టే నేపథ్యంలో పదవుల పంపకానికి ఇదే సరైన సమయమన్న మాట వినిపిస్తోంది. బయట చర్చ ఇంతలా సాగుతుంటే.. కేసీఆర్ మదిలో ఏమున్నదన్నది తేలాల్సి ఉంది.

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.