‘కారు’ మాటకు దీపపై సర్కార్ ఫైర్

ఎవడి గోల వాడిది అన్నట్లుగా ఉంది.. జిమ్నాస్ దీపా కర్మాకర్ వ్యవహారం చూస్తే. రియో ఒలింపిక్స్ లో ఆమె ప్రదర్శించిన అద్భుత ప్రతిభ.. యావత్ దేశం మొత్తాన్ని మురిపించింది. అవార్డులు.. రివార్డులు ఆమె సొంతమయ్యాయి. అందులో భాగంగా.. ఆమెకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించటం తెలిసిందే. అయితే.. అంత ఖరీదైన కారును తాను మెయింటైన్ చేయలేకపోతున్నానని.. అగర్తల లాంటి సిటీలో బీఎండబ్ల్యూ సర్వీసింగ్ స్టేషన్ లేదని.. రోడ్లు కూడా బాగోలేవని.. అందుకే తనకిచ్చిన కారును వెనక్కి ఇచ్చేస్తానంటూ దీపా చెప్పిన మాట.. ఇప్పుడామెకు కొత్త సమస్యల్ని సృష్టిస్తోంది.

దేశంలో క్రికెట్ కు.. క్రికెటర్లకు తప్పించి మిగిలిన క్రీడలకు.. క్రీడాకారులకు ఉన్న గ్లామర్ ఏ పాటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళ.. దీపా కర్మాకర్ లాంటి క్రీడాకారిణికి బీఎండబ్ల్యూ కారు స్తోమతకు మించిందే. కారు ఉండగానే సరిపోదు. అందుకు తగ్గట్లు సంపాదన.. దాని నిర్వహణకు అవసరమైన ఆదాయం ఉండాల్సిందే. ఈ విషయంలో దీపను తప్పు పట్టటానికి కూడా లేదు.

నా దగ్గర డబ్బుల్లేవు.. కారును మొయింటైన్ చేసే స్థోమత లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటంతో పాటు.. తానున్న ప్రాంతంలో సర్వీస్ సెంటర్ లేని కారును తాను వినియోగించలేనని చెప్పటాన్ని తప్పు పట్టలేం. కానీ..ఆమె మాటలు త్రిపుర ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించాయి. త్రిపుర పేరు ప్రఖ్యాతల్ని తీవ్రంగా దెబ్బ తీయటమే కాదు.. చులకన భావం కలిగించేలా ఆమె మాటలున్నాయని ఆ రాష్ట్ర మంత్రులు గుర్రుగా ఉన్నారు. కారును వెనక్కి ఇచ్చేసి.. దానికి సరిపడా డబ్బుల్ని ఇస్తే తనకు ఉపయోగకరంగా ఉంటుందన్న దీపా కర్మాకర్ మాటల్ని వాస్తవిక కోణంలో చూసినప్పుడు తప్పు పట్టలేం. రియోలో అద్భుత ప్రదర్శనతో ఆమెకు కోట్లాది రూపాయిలు నడుచుకుంటూ రావు. ఆమె సాధించాల్సిన విజయాలు చాలానే ఉన్నాయి. ఇందుకోసం భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున ఖర్చు అవసరం ఉంటుంది. ఇలాంటి వేళ.. ఖరీదైన కారులో తిరిగే కన్నా.. ఆమెకు అవసరమైన శిక్షణకు ఆ కారు కారణంగా వచ్చే మొత్తం సాయంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

అయితే.. ఈ అంశాన్ని త్రిపుర రాష్ట్ర సర్కారు మరోలా చూసింది. దీపా కర్మాకర్ మాటల కారణంగా.. రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని తెగ ఫీలైపోతున్నారు అక్కడి నేతలు. రాష్ట్రపతి.. ప్రధాని సహా పలువురు విదేశీ ప్రముఖుల కార్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగిన వైనాన్ని ప్రజా పనుల శాఖామంత్రి బాదల్ పేర్కొన్నారు. స్వరాష్ట్రాన్ని కించపరుస్తూ మాట్లాడిన దీపాకు సొంత రాష్ట్ర ప్రజలే గుణపాఠం  చెబుతారంటూ సీరియస్ అయ్యారు. మంత్రి గారి మాటల్లోనే అసలు నిజం ఉంది. రాష్ట్రపతి.. ప్రధాని.. ఇతర విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు.. వారు ప్రయాణించే మార్గాల్ని ఎంత బాగా తయారు చేస్తారన్నది దేశ ప్రజలందరికి తెలిసిందే. అలాంటి ఏర్పాట్లు సాదాసీదా ప్రజలకు ఉంటే ఇబ్బందే ఉండదు. సౌకర్యాల కల్పనలో వెనుకబాటు విషయంలో పుట్టని మంట.. ఉన్నది ఉన్నట్లుగా చెబితే మాత్రం పొడుచుకురావటం గమనార్హం. దీపా వ్యాఖ్యల్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలే కానీ.. ఆమె లాంటి వర్థమాన క్రీడాకారులపై కత్తి కట్టటం ఏ మాత్రం సబబు కాదు. ఆ విషయం ‘ఈగో’లతో బతికేసే రాజకీయనేతలకు ఒక పట్టాన అర్థం కాదేమో..?

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.